- బాండ్‌పేపర్లపై సంతకాలు తీసుకొని వదిలేసిన దుండగులు
- ఆదిబట్ల పీఎస్‌లో బాధితుడి ఫిర్యాదు.. కేసు నమోదు
ఇబ్రహీంపట్నం, వెలుగు : బట్టల వ్యాపారిని తుపాకీతో బెదిరించి దుండగులు కిడ్నాప్ చేశారు. రూ.కోటి డిమాండ్ చేశారు. తన దగ్గర అంత మొత్తం లేదని చెప్పడంతో బాండ్‌పేపర్లపై సంతకాలు తీసుకొని వదిలేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన రచ్చ నారాయణ స్థానికంగా బట్టల వ్యాపారం చేస్తున్నాడు. అతడికి గత కొన్నిరోజులుగా ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
ప్లాట్ ఉందంటూ ఓ మహిళ కాల్ చేయగా.. ఈ నెల 21న నారాయణ తన డ్రైవర్ ముసిబ్ ఖాన్‌తో కలిసి బొంగులూరు మెట్రో సిటీ వెంచర్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు ముఖానికి నల్ల బట్టలు కట్టుకొని, అతడిని భయపెట్టి.. గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. ఫోన్లు, కారు తీసుకున్నారు. అనంతరం తలపై గన్‌పెట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బు తన దగ్గర లేవని చెప్పడంతో 10 డాక్యుమెంట్లపై సంతకాలు, వేలిముద్రలు తీసుకున్నారు. ఆ తర్వాత 4 గంటల సమయంలో కొంగరకలాన్ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితుడు ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో శనివారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.